A A A A A

పాపాలు: [వ్యభిచారం]


౧ కోరింతియన్స్ ౬:౧౮
లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

హెబ్రీయులు ౧౩:౪
వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

జేమ్స్ ౪:౧౭
మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

౧ జాన్ ౧:౯
కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

ల్యూక్ ౧౬:౧౮
“భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

మాథ్యూ ౧౯:౯
భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.

రోమన్లు ౭:౨-౩
[౨] వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది.[౩] కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుణ్ణి కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుణ్ణి పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.

మార్క్ ౧౦:౧౧-౧౨
[౧౧] యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే.[౧౨] అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.

మాథ్యూ ౫:౨౭-౩౨
[౨౭] “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా.[౨౮] కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.[౨౯] నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.[౩౦] నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.[౩౧] “ ‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు.[౩౨] నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.

౧ కోరింతియన్స్ ౬:౯-౧౬
[౯] అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, వ్యభిచారులూ, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ,[౧౦] దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.[౧౧] గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై నీతిమంతులయ్యారు.[౧౨] నాకు అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.[౧౩] ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు.[౧౪] దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనల్ని కూడా తన శక్తితో లేపుతాడు.[౧౫] మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా చేయకుందును గాక.[౧౬] వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా?

ల్యూక్ ౧౮:౧౮-౨౦
[౧౮] ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు.[౧౯] అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.[౨౦] వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

౧ థెస్సలొనీకయులు ౪:౩-౫
[౩] మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.[౪] మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా[౫] పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం.

మార్క్ ౭:౨౦-౨౩
[౨౦] ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి.[౨౧] ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,[౨౨] వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి.[౨౩] ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”

మాథ్యూ ౧౫:౧౭-౨౦
[౧౭] నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది.[౧౮] కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా?[౧౯] హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.[౨౦] మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

జాన్ ౮:౪-౧౧
[౪] వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.[౫] ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు.[౬] ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు.[౭] వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి[౮] మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు.[౯] ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది.[౧౦] యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు.[౧౧] ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు.

౧ కోరింతియన్స్ ౭:౧-౪౦
[౧] ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి.[౨] అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.[౩] భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి.[౪] భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.[౫] ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.[౬] ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.[౭] ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.[౮] నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను.[౯] అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.[౧౦] ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.[౧౧] ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.[౧౨] మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.[౧౩] అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు.[౧౪] అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.[౧౫] అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు.[౧౬] మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?[౧౭] అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.[౧౮] ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు.[౧౯] దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,[౨౦] ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి.[౨౧] దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది.[౨౨] ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస.[౨౩] ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.[౨౪] సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.[౨౫] పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను.[౨౬] ఇపుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం.[౨౭] వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా ఒంటరిగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు.[౨౮] ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.[౨౯] సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.[౩౦] ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి.[౩౧] ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.[౩౨] మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.[౩౩] పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు.[౩౪] అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.[౩౫] మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.[౩౬] ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. వారు పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.[౩౭] అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకొని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని.[౩౮] కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.[౩౯] భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.[౪౦] అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.

Telugu Bible (IRV) 2019
Bridge Connectivity Solutions Pvt. Ltd