A A A A A

మిస్టరీస్: [క్యాన్సర్]


౨ కోరింతియన్స్ ౪:౧౬-౧౯
[౧౬] అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.[౧౭] మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం.[౧౮] కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.[౧౯] భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.

మాథ్యూ ౧౧:౨౮-౨౯
[౨౮] “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను.[౨౯] నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది.

జాన్ ౧౪:౧-౪
[౧] “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి.[౨] నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను.[౩] నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను.[౪] నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.

రోమన్లు ౮:౧౬-౨౫
[౧౬] మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు.[౧౭] మనం పిల్లలమైతే వారసులం కూడాా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.[౧౮] మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.[౧౯] దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది.[౨౦] ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి,[౨౧] నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది.[౨౨] ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.[౨౩] అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.[౨౪] ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు?[౨౫] మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.

౧ పేతురు ౧:౩
మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

౨ కోరింతియన్స్ ౧:౩-౬
[౩] మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.[౪] ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.[౫] క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.[౬] మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.

Telugu Bible (IRV) 2019
Bridge Connectivity Solutions Pvt. Ltd