A A A A A

చర్చి: [యేసు జననం]


మాథ్యూ ౧:౧౮-౨౩
[౧౮] యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.[౧౯] ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.[౨౦] అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపూ, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.[౨౧] ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.[౨౨] “ ‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.[౨౩] ***

ల్యూక్ ౨:౭-౨౧
[౭] ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు.[౮] ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు[౯] ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.[౧౦] అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.[౧౧] దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.[౧౨] మీకు కొండ గుర్తు ఒకటే. ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు.[౧౩] ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి,[౧౪] “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు.[౧౫] ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకొని[౧౬] త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు.[౧౭] ఆ శిశువును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు.[౧౮] గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.[౧౯] మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.[౨౦] ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.[౨౧] ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు.

మాథ్యూ ౨:౧-౧౨
[౧] హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి,[౨] “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు.[౩] హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు.[౪] కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు.[౫] అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే,[౬] ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు.[౭] అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు.[౮] తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు.[౯] వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది.[౧౦] ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు.[౧౧] ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు.[౧౨] హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.

గలతీయులకు ౪:౪
అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి,

ల్యూక్ ౨:౧-౪
[౧] ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు.[౨] ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య.[౩] అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు.[౪] యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు.

ప్రకటన ౧౨:౧-౫
[౧] అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది.[౨] ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.[౩] ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.[౪] వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.[౫] ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.

Telugu Bible (IRV) 2019
Bridge Connectivity Solutions Pvt. Ltd